Friday, June 19, 2009

కూలీ నుంచి కింగ్ ... వేణుభగవాన్ లైఫ్ స్టోరీ


నాటి కూలీ...నేటి వ్యక్తిత్వ వికాస నిపుణుడు

ఆటుపోట్లు... అవమానాలు... సమస్యలు ...ప్రతికూల వాతావరణం... ఇలా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదగాలన్న తపన, కొత్తదనం కోసం నిరంతర అన్వేషణ... ఓ కుర్రాడిని విజయ తీరాలకు నడిపించింది. ఆర్థిక ఇబ్బందులతో ఐటీఐ వరకే చదవగలిగినా... బతుకు పోరాటంలో రూ.12 రోజు కూలీతో కెరీర్‌ను ప్రారంభించాడు. ఎక్కడ ప్రారంభించామన్నది కాదు లక్ష్యసాధనలో ఎక్కడి చేరామన్నదే ఆ కుర్రాడికి ప్రధానం. తనలో ఉన్న ఆత్మనూన్యతను అధిగమించేందుకు మొదలైన ప్రయత్నం... కొత్త ప్రపంచాన్ని సృష్టించాలన్న సంకల్పానికి దారితీసింది. అంతే... వ్యాపారాన్ని వదిలి... వ్యక్తిత్వ వికాస నిపుణులయ్యారు. ఒక విజయం నుంచి మరో విజయానికి అతని ప్రస్థానం కొనసాగుతోంది. అనతికాలంలోనే 700పైగా ప్రసంగాలిచ్చి లక్ష్యం కోసం తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఆ స్ఫూర్తి కెరటమే నగరానికి చెందిన వేణు భగవాన్‌.

పదో తరగతి పరీక్షలు రాసి.. వేసవిలో చుట్టాలింటికి వెళ్లాడా కుర్రాడు. ఫలితాలొచ్చాయి. పరీక్షలో పాస్‌ అవతానన్న నమ్మకం ఉన్నా పైకి చెప్పలేనితనం. అంతలో... ఫలితాల పేపర్‌ పట్టుకొచ్చారొకరు. ఇంట్లో ఉన్న పిల్లల రిజల్ట్‌ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. మిగితా వారి నెంబర్లు కనిపించినా... ఈ అబ్బాయి నెంబరు కనిపించలేదు. వీడా పాస్‌ అయ్యేది?... అన్న మాటలతో దిమ్మ తిరిగినంత పనైందా కుర్రాడికి. ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ... 'అపజయం ఇంత భయంకరమా?'అనుకున్నాడు. బేలగా... మౌనంగా ఉండిపోయాడు. రెండు నిమిషాలు గడిచాయి. 'అరే... తప్పుగా చూశాం. వేణు నెంబరు ఉంది. సెకండ్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యాడు' అన్నారొకరు. వీడు జీవితంలో పైకి వస్తాడంటూ... అంతకు ముందే ఎగతాళి చేసిన బంధువు తన మాటల్నిమరిచి మెచ్చుకున్నాడు. విజయం సాధిస్తేనే విలువ ఉంటుందన్న విషయం ఆ కుర్రాడికి ఈ ఘటనతో మనసులో బలంగా నాటుకుపోయింది.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వద్ద చిన్న గ్రామానికి వేణు తండ్రి సర్పంచ్‌. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నా... అనుకోని అర్థిక సమస్యలతో అవన్నీ కరిగిపోయాయి. ఈ మార్పు అతని చదువుపై పడింది. బంధువుల ఇళ్లలో... మిషనరీ హాస్టల్లో ఉంటూ చదువు సాగించారు. 'స్కూల్‌కి పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్లి వచ్చేవాడ్ని. గోదావరి మీదుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ట్యూషన్‌. రాత్రిళ్లు మాష్టారింట్లోనే పడుకొని ఉదయాన్నే ఇంటికి వెళ్లేవాడ్ని''... అంటూ నడకలతో సాగిన తన చదువు క్రమాన్ని వివరించారాయన. పదోతరగతి పాస్‌ అయ్యాక ఐటీఐలో చేరినా... కుటుంబ సమస్యల కారణంగా చదువుకు పుల్‌స్టాప్‌ పెట్టాల్సి వచ్చింది. ఉద్యోగంలో చేరేందుకు వయసు చాలదనటంతో... ఓ గ్లాస్‌ ఫ్యాక్టరీలో... పాత సీసాల్ని వేరే పనిలో రూ.12 రోజు కూలీగా చేరారు. తర్వాత మరో చిన్న ఉద్యోగం. ఎక్కడ చేరినా హుషారుగా పని చేయటంతో అందరి అభిమానాన్ని అనతికాలంలో పొందేవారు. ఓ చిన్న కంపెనీలో పని చేసేటప్పుడు అక్కడి ఉద్యోగులు ఇంగ్లిషులో మాట్లాడుతుంటే... గమ్మత్తుగా అనిపించేది. ఎలాగైనా తానూ ఇంగ్లిష్‌ మాట్లాడాలన్న తలంపుతో... రామకృష్ణ మఠంలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో చేరారు. ఒక్కో కోర్సును రెండుసార్లు చదివారు. ఉద్యోగం చేస్తున్నా ఇంగ్లిష్‌ను మాత్రం వదల్లేదు. మొదట్లో కొరకరాని కొయ్యలా అన్పించిన ఇంగ్లిష్‌ వంటబట్టింది. కృషి ఫలించి... అంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇంగ్లిష్‌లో వాగ్థాటి చూసి ఆయన ఐటీఐ వరకు మాత్రమే చదివారంటే ఎవరూ నమ్మేవారు కాదు.

వ్యాపారంలో...
చిన్న చిన్న ఉద్యోగాల తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో డ్రాఫ్ట్‌మెన్‌గా చేరారు. సోదరుడి స్క్రీన్‌ ప్రింటింగ్‌ వ్యాపారం మూస పద్ధతిలో సాగటాన్ని చూసి... దానికి స్వస్తి పలికి... మల్టీకలర్‌లో బ్యానర్లు తయారు చేశారు. ఈ కొత్త విధానానికి మార్కెట్‌లో అపూర్వ ఆదరణ లభించింది. ''ఊపిరి సలపనంత పని...20మందికి పైగా ఉద్యోగులు... కారు... ఇలా అన్నీ ఉన్నా చుట్టూ ఉన్న వారికి ఏమీ చేయలేకపోతున్నామన్న భావన... చేస్తోన్న పనిలో సంతృప్తి ఉన్నా... తెలీని కొరత వెంటాడేది. సంపాదనే కాదు... చుట్టూ ఉన్న సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన ఉండేది. దీనికి తోడు తెలీని ఆత్మనూన్యతకు గురయ్యేవాడ్ని. దాన్ని అధిగమించేందుకు వ్యక్తిత్వ వికాస కోర్సులకు వెళ్లా. శిక్షణలో భాగంగా ఓ అంశంపై మాట్లాడమంటే... అనర్గళంగా మాట్లాడి బెస్ట్‌ స్పీకర్‌ అవార్డు పొందా. చిన్నచిన్న విషయాలకే బాధ పడటం... తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే వారిని చూసినప్పుడు పుస్తకం రాయాలనిపించింది. ఎవరికి వారు తమలో అంతర్లీనంగా ఉండే శక్తి గురించి వివరిస్తూ రాశా. ఆ పుస్తకం అనుకున్న దానికంటే విజయవంతమైంది'' అని చెప్పారు వేణు. మొదట తెలుగులో పుస్తకం రాసినా తర్వాత మరో పుస్తకాన్ని ఇంగ్లీషులో రాశారు.

ప్రతికూలతను...
నిరంతర అధ్యయనం... అభ్యాసమే తననీ స్థాయికి తీసుకొచ్చాయని వేణు అంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్ని పాఠాలుగా మార్చుకుంటే... విజయం దానంతట అదే వస్తుందంటారు. వ్యక్తిత్వ నిపుణులుగా జ్యూడిషియల్‌ అకాడమీ మొదలుకొని విభిన్న వర్గాలకు చెందిన నిపుణులకు 1995 నుంచి ఇప్పటివరకు 700పై ఉపన్యాసాల్ని ఇస్తూ... వేలాది మందిని ప్రభావితం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నెహ్రూ యువ కేంద్రం వారి 'బెస్ట్‌ యూత్‌' అవార్డు సాధించారు. దేశ వ్యాప్తంగా వ్యక్తిత్వ వికాస తరగతుల్ని బోధించేందుకు విబోల్డ్‌ అనే సంస్థను ఏర్పాటు చేసి... పాఠశాలల్లో... కళాశాలల్లో విద్యార్థులకు స్ఫూర్తివంతమైన ఉపన్యాసాలను ఉచితంగా బోధిస్తున్నానన్నారు. నలుగురు నడిచే దారిలో కాక... విభిన్నంగా నడుస్తూ... కొత్త ప్రపంచాన్ని కలిసి సృష్టిద్దామన్న ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.

1 comment:

Anonymous said...

baagundi.
mee dvaraa venugari ki abhinandanalu.