Wednesday, December 24, 2008

ప్రజలు అమాయకులా.. ప్రభుత్వం తెలివైనదా?


గతంలో పెట్రోలు ధర బ్యారల్ నలభై డాలర్లు లోపు ఉన్నపుడు అంటే నాలుగేళ్ల క్రితం పెట్రోలు ధర నలభై నలభై రూపాయలు వద్ద ఉండేది. బ్యారెల్ ధర క్రమంగా పెరిగి నూట నలభై ఏడు డాలర్లకు పోతే మన వాళ్లు పెట్రోలు ధర క్రమంగా పెంచుకుంటూ పోయి చివరికి దానిని యాభై ఆరు రూపాయలకు తీసుకెళ్లారు. ఇపుడు ప్రజలు, ప్రతిపక్షాలు గోల చేస్తే ఐదు రూపాయలు ముష్టి వేశారు. అంతర్జాతీయ ధరలు మూడు రెట్లకు పైగా తగ్గితే సాధారణంగా పెట్రోలు ధర ఇరవై రూపాయలు లీటరు చొప్పున అమ్మాలి. మళ్లీ అంత ఆశ మంచిది కాదు కాబట్టి మనవాళ్లు కూడా పది రూపాయలు తగ్గించమని అడిగారు. అది కూడా తగ్గించలేదు. పైగా.. వేసిన కనీస ముష్టి కూడా గ్యాస్ సిలిండర్ల విషయంలో మరిచిపోయారు. అదేమని అడిగితే పెట్రోలు ధర తగ్గినా డాలరు విలువ పెరిగిందని మాటలు చెబుతారు?దీనిని బట్టి ప్రజలు అమాయకులా? లేక పాలకులు తెలివైన వారు అనుకోవాలా అంటే రెండూ కాదు... ప్రజల నిస్సహాయత.. ప్రభుత్వస్వార్థం.

దేశంలో విమాన ఇంధనం కంటే ద్విచక్ర వాహన ఇంధన ధరే ఎక్కువ. ప్రస్తుతం విమాన ఇంధనం ముప్పై ఆరు రూపాయలు, బైకు ఇంధనం యాభై రూపాయలు (తగ్గించాక).

అంతర్జాతీయ ధరల ప్రకారం ముడి చమురు విలువ లెక్కిద్దాం..

ఒక బ్యారెల్ అంటే నూటా అరవై లీటర్లు. దీన్ని శుద్ధి చేస్తే పది శాతం మేర వృథా పోతుంది. అంటే బ్యారల్ కు నూటా నలభై నాలుగు లీటర్ల నికర ఉత్పత్తులు వస్తాయి. తాజా లెక్కల ప్రకారం ముడిచమురు ధర నలభై డాలర్లు ఉంది. దీని ప్రకారం శుద్ధి అనంతరం ఒక లీటరు పెట్రోలు ఉత్పత్తికి నికరంగా పద్నాలుగు రూపాయలు అవుతుంది. లీటరు ముడిచమురు శుద్ధి చేయడానికి అత్యాధునిక రిలయన్స్ రిఫైనరీలో దీనికయ్యే ఖర్చు ఇరవై పైసలు. ఈ లెక్కన శుద్ధి ఖర్చుతో కలిపినా నాణ్యమైన లీటరు పెట్రోలుకు తయారు చేయడానికి ఖర్చయ్యేది పదిహేను రూపాయలు .

చమురు సంస్థలుకు నిజంగా నష్టాలున్నాయా?
చమరు కంపెనీలకు నష్టాలు రావట్లేదు. ముడిచమురు వాస్తవ ధర, దాని శుద్ధికయ్యే ఖర్చు, మార్కెటింగ్ వ్యయం, ముప్పై శాతం లాభం అన్నీ కలుపుకుని పెట్రోలు, డీజిలు ధర ఇరవై ఐదు రూపాయలకు మించదు. కానీ.. ప్రభుత్వం దీనిని యాభై రూపాయలు, ముప్పై ఐదు రూపాయలు చొప్పన అమ్ముతోంది. మనకు అమ్ముతున్న యాభై రూపాయలు... ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా?

2 comments:

Rajendra Devarapalli said...

మంచి ఆసక్తికరమైన అంశం.మొన్నే ఎక్కడో చదివా..చాలామంది వ్యాపారస్తులు తమకొస్తున్న వందకు నూటయాభై శాతం లాభాల్లో ముప్ఫైశాతం తగ్గినా ఆ వ్యాపారాలు మూసేస్తారని.
ప్రభుత్వం కూడా లాభాపేక్షతో ఉండొచ్చు.కానీ మీరిచ్చినగణాంకాల ప్రకారం అవి దారుణాతిదారుణంగా ఉన్నాయి.
ఇక్కడ నాక్కొన్ని అనుమానాలు.
"బ్యారెల్ ధర క్రమంగా పెరిగి నూట నలభై ఏడు రూపాయలకు పోతే" అన్నారు అవి డాలర్లా,రూపాయలా?
ఎందుకంటే,మీరు ఇక్కడ"తాజా లెక్కల ప్రకారం ముడిచమురు ధర రూ.నలభై డాలర్లు ఉంది" అన్నారు.రూ.అన్నాక మరలా డాలర్లు ఎందుకు??

Prakash chowdary said...

రాజేంద్రకుమార్ గారు థ్యాంకూ..

మీరు సూచించిన తప్పులు సరిదిద్దాను.