Thursday, February 4, 2010

వయసు - శృంగారం : ఎందుకు వ్యతిరేకం ?

అతనిలో శృంగార సామర్థ్యం సన్నగిల్లుతుంది. ఆమెకు సెక్సంటే ఆసక్తి చచ్చిపోతుంది. ఎప్పుడో ఒకసారి, ఇద్దర్లో ఎవరో ఒకరు చొరవ తీసుకున్నా... అంతా వెుక్కుబడి! ఈ నడివయసు సంక్షోభానికి మనసును మించిన మందులేదంటారు సెక్సాలజిస్టులు.

అతడు...
శృంగార యోధుడు. శోభనపు పెళ్లికొడుకు హోదాలో హారతులు అందుకున్నది వెుదలు, రతీమన్మథక్రీడలో రాటుదేలిపోయాడు. నిత్య ప్రయోగశీలి. వాత్స్యాయనాన్ని బట్టీపట్టాడు. ఓటమి ఎరుగని విజేత. ఆమెను గెలిపించి తనూ గెలుస్తాడు.

ఆమె...
శృంగార రసాధిదేవత. పట్టెమంచపు పట్టువిడుపులు తెలిసిన నేర్పరి. అతడిని కవ్విస్తుంది. నవ్విస్తుంది. ఉడికిస్తుంది. ఊరిస్తుంది. భీతహరిణంలా కనిపించే ఆడపులి!
పడకగది...
నాలుగుగోడల సామ్రాజ్యం. కొన్నిసార్లు ఆమె రాణి, ఆదేశిస్తుంది. అతను దాసానుదాసుడు, శిరసావహిస్తాడు.
కొన్నిసార్లు అతను రారాజు, కనుసైగచేస్తాడు. ఆమె దాసి, మనసెరిగి మురిపిస్తుంది.
వెుత్తంగా ఆ పడకగది ఓ వలపుబడి. అక్కడ, ఎక్కాల విషయంలో గణితశాస్త్రం కూడా తప్పులో కాలేస్తుంది. ఎందుకంటే, ప్రతిరాత్రీ రెండు ఒకట్లు ఒకటే అవుతాయి మరి.
అచ్చంగా పాఠ్యపుస్తకంలో చెప్పినట్టే విజాతి ధృవాలు గాఢంగా ఆకర్షించుకుంటాయి కాబట్టి, భౌతికశాస్త్రం సగర్వంగా మీసాలు మెలేస్తుంది.
అర్థశాస్త్రంలోని డిమాండు-సప్త్లె సూత్రం ఆ జంటకి అతికినట్టు సరిపోతుంది. ఎక్కడ తేడా వచ్చినా మిగిలేది 'అసంతృప్తే'.
ఆలూమగల్ని చూసి తెలుగు గ్రామరు తెల్లవెుహం వేస్తుంది. ద్విత్వాక్షరాలూ సంయుక్తాక్షరాలూ ఆ దగ్గరితనానికి కుళ్లుకు చస్తాయి. సవర్ణదీర్ఘసంధిలా మూడువందలఅరవై అయిదు రాత్రులూ సుదీర్ఘాలే. రతీమన్మథులు, నాయికానాయకులు, దిండూదుప్పటి...అక్కడన్నీ ద్వంద్వ సమాసాలే.

ప్రస్తుతం...
అతని జోరు తగ్గింది. హోరు మాయమైంది. పోరులో సర్వంకోల్పోయిన సర్వసైన్యాధ్యక్షుడిలా డీలాపడిపోయాడు. ఆమె వలచి వచ్చినా, వద్దని ముడుచుకుపోతాడు.

'బాగా అలసిపోయాను'

'పొద్దున్నే మీటింగ్‌ ఉంది'

'ఆఫీస్‌ టెన్షన్స్‌'

...అతని సాకులు!

ఆమె సొగసు మసిబారింది. కొంటెచూపు పదును తగ్గింది. నడక లయతప్పింది. ఆడతనం జాడకోల్పోయింది. ఆలింగన చుంబనాదులకు కూడా స్పందించలేని జడత్వమేదో ఆవరించింది.

'తలనొప్పిగా ఉంది'

'మూడ్‌ బావోలేదు'

'ప్లీజ్‌...వద్దు!'

...ఆమె తప్పించుకునే మార్గాలు.

ఆ నిర్లిప్తతకు కారణం నడివయసు గండం. నలభై, నలభై అయిదు మధ్య వెుదలయ్యే సరికొత్త సంక్షోభం. లైంగిక సామర్థ్యం సన్నగిల్లిపోవడం, బంగారంలాంటి శృంగార జీవితం మెల్లమెల్లగా డొల్లబారిపోవడం, వయసుతో వచ్చిన అయస్కాంతశక్తి క్రమంగా నీరసించడం... ఆ సమస్య లక్షణాలు.

మంచానికి అతను తూర్పయితే, ఆమె పడమర. ఆమె పడమరైతే, అతను తూర్పు. ఎవరో స్కేలుతో గీసినట్టు, ఇద్దరి మధ్యా సన్నని విభజన రేఖ. తుడిచేసుకోవాలని ఉన్నా తుడిచెయ్యలేని అశక్తత, ఎడబాటును శాశ్వతం చేసే తడబాటు.

ఆ పడకగది ఎప్పుడో కళతప్పిపోయింది. వూయలై వూగిన మంచం, నిశ్శబ్దాన్ని భరించలేక కొయ్యబారిపోయింది. ఆ గోడలు గుసగుసలు విని ఎన్నాళ్త్లెందో.

అంతేనా, సగం జీవితం శృంగారం లేకుండానే తెల్లారిపోవాల్సిందేనా? వలపు వూట పూర్తిగా ఎండిపోయినట్టేనా? అయినా, ఆ మదనుడికిదేం మాయరోగం?

నీరసపడాల్సిన పన్లేదు, నడివయసు సంక్షోభాన్ని గట్టెక్కడం సాధ్యమేనంటారు సెక్సాలజిస్టులు. అయితే, అదంత సులభం కాదు. అలా అని కష్టమూ కాదు. ఒళ్లుగుల్లచేసే మద్యం, ధూమపానం, మాదకద్రవ్యాలు...వంటి దురలవాట్లను గెలవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటుచేసుకోవాలి. దుష్పరిణామాలకు కారణమయ్యే హైపర్‌టెన్షన్‌, మధుమేహం తదితర సమస్యల్ని నియంత్రించాలి. ఆశావాదంతో హార్మోన్ల ప్రభావానికి అడ్డుకట్టవెయ్యాలి. మరీముఖ్యంగా, మనసును నిత్యయవ్వనంగా ఉంచుకోవాలి.
పదహారేళ్ల మనసు...
'డాక్టర్‌! లైంగిక సామర్థ్యం పెరగడానికి ఏదైనా మందుంటే ఇవ్వండి' అని అడిగాడో నడివయసు రసికుడు.

'తప్పకుండా. కానీ అది దుకాణాల్లో దొరకదు. ఏ శాస్త్రవేత్తా తయారు చేసివ్వలేడు. మీకు మీరే సృష్టించుకోవాలి' చెప్పాడు డాక్టరు. అదేమిటో అతనికి అంతుపట్టలేదు.

'ప్రేమ'...

ప్రిస్క్రిప్షను పేపరు మీద రాసిచ్చాడు డాక్టరు.

నిజమే, ప్రేమను మించిన ఔషధం లేదు. ప్రేమను మించిన కావోద్దీపన సాధనం లేదు. ఇద్దరి మధ్యా ఉన్న ప్రేమ, వేయి వయాగ్రాలకు సరిసమానం. ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకునే దంపతుల్లో వయసుతో సంబంధం లేకుండా, సెక్స్‌ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. 'లవ్‌ అండ్‌ సర్వైవ్‌: సైంటిఫిక్‌ బేసిస్‌ ఫర్‌ హీలింగ్‌ పవర్‌ ఆఫ్‌ ఇంటిమసీ' రచయిత డీన్‌ ఆర్నిష్‌ దాదాపు పదివేలమంది దంపతుల్ని అధ్యయనం చేసి మరీ ఈ విషయం చెప్పారు. లైంగిక సమస్యలే కాదు, హృద్రోగం, క్యాన్సర్‌ వంటి తీవ్ర అనారోగ్యాల విషయంలోనూ 'ప్రేమ' మంచి ఔషధంగా పనిచేస్తుందని సదరు రచయిత చెబుతున్నారు.

కానీ, నాలుగుపదుల వయసులో ప్రేమను వ్యక్తం చేసుకునే తీరిక ఎక్కడిది? అసలు నడివయసంటేనే బోలెడన్ని అపోహలు, లెక్కలేనన్ని భయాలు, వోయలేనన్ని బాధ్యతలు, భరించలేనంత అభద్రత. అన్నీ కలిసి ఆ జంట శృంగార జీవితాన్ని సమస్యలపాలు చేస్తాయి. వయసుతోపాటు వచ్చే అనారోగ్యం...ఆ అనారోగ్యం వోసుకొచ్చే వైఫల్యాలూ పడకగది ప్రయత్నాల్ని అపహాస్యం చేస్తున్న సమయంలోనే...కెరీర్‌ సంక్షోభమూ వెుదలవుతుంది.

వృత్తి ఉద్యోగాల్లో కొత్తతరం పోటీకి వస్తుంది. సమకాలీన సాంకేతిక పరిజ్ఞానంతో, తాజా సమాచారంతో, కొండంత ఉత్సాహంతో, తమనుతాము నిరూపించుకోవాలన్న తపనతో రంగప్రవేశం చేసే ఆ కుర్రాళ్లు అతిపెద్ద సవాలై నిలుస్తారు. చాలా సందర్భాల్లో యాజమాన్యం ఓటూ వాళ్లకే పడుతుంది. తప్పదు, పోటీపడాలి. వెనకబడితే వెనకేనోయ్‌. ఏదో ఒకరోజు కొడుకు వయసో, కూతురి వయసో ఉన్న పిల్లల ముందు చేతులుకట్టుకు నిలబడాల్సిన పరిస్థితి వచ్చినా రావచ్చు. మెనోపాజ్‌, ఆండ్రోపాజ్‌ లక్షణాలనదగ్గ మతిమరుపు, ఏకాగ్రత లోపించడం, చికాకు, అసహనం...పర్సనల్‌ రికార్డులో ఎర్ర గుర్తులవుతాయి. ప్రవోషన్‌ ప్రయత్నాలకు గండికొడతాయి. టెస్టోస్టెరాన్‌ తగ్గుదల కారణంగా రిస్క్‌ తీసుకోగల సత్తా తగ్గిపోతుంది. అభద్రత పెరుగుతుంది.

పోటీ ప్రపంచంలో మనుగడ కోసం పోరాటం సాగించే స్త్రీపురుషులిద్దరికీ ఇలాంటి సవాళ్లు తప్పవు. వృత్తిజీవితంలోని 'అసమర్ధత' ముద్ర పడకగదిలోనూ ప్రశాంతంగా ఉండనీయదు. ఆ ఒత్తిడి మధ్య సెక్స్‌ ఆలోచనలు చచ్చిపోతాయి.

హౌసింగ్‌ లోన్‌, కార్‌ లోన్‌, పర్సనల్‌ లోన్‌, ఫారిన్‌ట్రిప్‌ లోన్‌... జీతానికి కోత విధించే వాయిదాలకు పిల్లల పైచదువుల ఖర్చులూ తోడవుతాయి. బుర్రనిండా అప్పుల కుప్పలే, ఆర్థిక సమస్యలే. శృంగార భావనలకు చోటెక్కడిది? చేతికొచ్చిన పిల్లల్ని ఇంట్లిో పెట్టుకుని, పడక సుఖానికి వెంపర్లాడటం తప్పేవో అన్న అపరాధ భావనొకటి. ఒకటిరెండుసార్లు, దొంగల్లా దొరికిపోయి తలదించుకున్న అనుభవాలూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే, మనసు వయసుకు మించి ముసలిదైపోతుంది. ఆలూమగలు బలవంతపు వృద్ధాప్యాన్ని కొనితెచ్చుకుంటారు.

అదే జీవిత భాగస్వామి. అవే అనుభవాలు. పాతికేళ్ల కాపురం తర్వాత శృంగార జీవితం పాతబడిపోయినట్టు అనిపిస్తుంది. సెక్స్‌ వెుక్కుబడి వ్యవహారంగా మారిపోతుంది. అన్నేళ్లూ రంభలా వూరించిన శ్రీమతిలో మెరుపు మాయమైపోయిన భావన. అతని బానకడుపు, బట్టతల ఆమెలోని వోహాన్ని చిదిమేస్తాయి. ఒకరికొకరు ఆకర్షణీయంగా కనిపించాలనే తపన చచ్చిపోతుంది. ఇలాంటప్పుడే, శృంగారానికి శరీరం సహకరించినా మనసు వెురాయిస్తుంది. ఈ స్తబ్దతనూ నిరాసక్తతనూ గెలవడానికి ఓ మంచి ఔషధముంది. దాని పేరు...మనసు!

'అక్షరాలా నిజం. శృంగారం మనసుతో వెుదలవుతుంది. మనసుతోనే ముగుస్తుంది. నడివయసే కానివ్వండి. ఆరుపదులే కానివ్వండి. వయసును గెలవలేం. అది మన చేతుల్లో లేదు. కానీ, ఒత్తిడిని జయించగలం. అది మన చేతుల్లోనే ఉంది. ఆఫీసులో ఏవో ఇబ్బందులు ఉండవచ్చు. వృత్తి జీవితంలో ఇంకేవో సమస్యలు ఉండవచ్చు. ఆఫీసు, ఇల్లు...రెండూ వేరువేరు ప్రపంచాలని మరచిపోకూడదు. పాదరక్షల్ని బయటే విప్పేసి ఇంట్లోకెళ్లినట్టు, ఒత్తిడిని వదిలేసి పడకగదిలోకి ప్రవేశించండి. జీవిత భాగస్వామి ముందు ముసుగులొద్దు. భయాలొద్దు. సంకోచాలొద్దు. మనసు విప్పి మాట్లాడండి. కావలసింది అడగండి. అడిగింది ఇవ్వండి. వయసుదేముంది? వస్తేరానీ...యాభై, అరవై...' అని ధైర్యం చెబుతారు ప్రఖ్యాత సెక్సాలజిస్టు ప్రకాశ్‌ కొఠారి.

'పెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ'... తమ సామర్థ్యం మీద తమకున్న అపనమ్మకం, సగం జంటల్ని సమస్యలపాలు చేస్తుంది. అలాంటి సమయంలో జీవిత భాగస్వామి పాత్ర చాలా ముఖ్యం. చేతల ద్వారా, మాటల ద్వారా ఒకరికొకరు ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి. అసలు జీవిత భాగస్వామితో లైంగిక విషయాలు మాట్లాడేవారి సంఖ్య సగానికంటే తక్కువేనని సెక్స్‌ సర్వే-2009 చెబుతోంది. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగితే, నడివయసు ప్రభావం చాలావరకు దూరమైపోతుంది.
వయస్కాంత శక్తి...
మగవాడు ఆశావాది. లక్షణమైన ఉద్యోగం పోయినా లెక్కపెట్టడు. తన అర్హతకు తగిన కొలువు వెతుక్కుంటూ వస్తుందని నమ్ముతాడు. ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయినా కుంగిపోడు. సున్నానుంచయినా వెుదలుపెట్టగలనన్న ధీమా. పడకగదిలో మాత్రం, ఏ చిన్న వైఫల్యం ఎదురైనా తట్టుకోలేడు. గిజగిజలాడిపోతాడు. మగసిరి సంపదల్ని ఎవరో దోచుకుపోయినట్టు బాధపడతాడు.

రాజేంద్రదీ దాదాపు అలాంటి పరిస్థితే. నిన్నవెున్నటిదాకా తిండిలా, నిద్రలా, శ్వాసలా...శృంగారం అతని జీవితంలో భాగం. ఆఫీసులో ఎన్ని పనులున్నా చకచకా చక్కబెట్టుకుని ఎనిమిదింటికంతా ఇంటికొచ్చేస్తాడు. తప్పనిసరై క్యాంపులకెళ్లినా అర్ధరాత్రి అయ్యేసరికి టకటకమని తలుపుతడతాడు. వచ్చితీరతాడని ఆమెకు తెలుసు. ఆమె ఎదురుచూస్తుంటుందని అతనికీ తెలుసు.

పెళ్లయి పదిహేనేళ్లయినమాటే కానీ, ఏకాంతంలో మాత్రం ఇద్దరూ కొత్తదంపతులే. ఆమె చూపు చాలు, అతనికి మత్తెక్కించడానికి. అతని స్పర్శ చాలు, ఆమె కరిగిపోడానికి. ఆ పడకగదిలో ఇప్పుడు...ఉలుకుల్లేవు, పలుకుల్లేవు. గుసగుసల్లేవు, పదనిసల్లేవు.

ఆ స్తబ్ధతకు కారణం, అంగస్తంభన సమస్య. ఏకంగా శృంగార జీవితాన్నే స్తంభింపజేసింది. లేహ్యాలు వాడాడు. చిట్కాలు ప్రయోగించాడు. నపుంసకుడినైపోయానని నిర్ధారణకు వచ్చాడు. సమయానికి తిండి లేదు. నిద్రలేదు. ఆఫీసుకెళ్లినా పరధ్యానంగానే. అతణ్ని మామూలు మనిషిని చేయడమెలా?
పురుషుడితో పోలిస్తే స్త్రీ శృంగార పరమపదసోపానానికి ఒకటిరెండు మెట్లెక్కువ. ఆ ప్రక్రియ కాస్త సంక్లిష్టం కూడా. ముందు, ఆలోచన వెులకెత్తాలి. కోరిక పురులు విప్పాలి. శరీరం శృంగార రసాస్వాదనకు సిద్ధంకావాలి. నచ్చిన మనిషితో ఆ నెచ్చెలి కూడాలి. అప్పుడే తృప్తి, భావప్రాప్తి. ఆమె శరీరమెంత సున్నితవో, మనసు అంతకు పదిరెట్లు సున్నితం. ఒడుదొడుకులు లేనప్పుడే ఆ సుకుమారి శృంగార రసయాత్ర సాఫీగా సాగుతుంది. ఏ చిన్న అడ్డంకి వచ్చినా అనుభూతుల్ని ఆస్వాదించలేదు. మధ్యవయసు గృహిణి సుమలత సమస్యే తీసుకోండి. ఈమధ్య ఆమెకు సెక్సంటేనే వెగటుపుట్టింది. భర్త ఒంటిమీద చేయి వేసినా తేళ్లూ జర్రులూ పాకుతున్నట్టు అనిపిస్తుంది. నిరాశపరచడం ఇష్టంలేక, సరేనన్నా...భరించలేనంత నొప్పి. అదో నరకం. నిన్నటిదాకా రతీదేవిలా మురిపించిన శ్రీమతి... ఎందుకిలా ప్రవర్తిస్తోందో అతనికి అర్థంకావడం లేదు. సుమ కూడా మనసు విప్పే ప్రయత్నం చేయడంలేదు. ఫలితంగా ఏవో అపార్థాలు. సమస్య విడాకుల దాకా వచ్చింది. ఇప్పుడేం చేయాలి?

నడివయసు శృంగార జీవితం, నడిసముద్రంలో నావలాంటిది. ఆటుపోట్లెక్కువ. ఆలూమగలిద్దరూ తట్టుకుని ముందుకెళ్తేనే గట్టు చేరుకుంటారు. అందులోనూ అనారోగ్యం అన్నేళ్లుగా కాచుకు కూర్చునుంటుంది. నలభైదాటగానే అమాంతంగా దాడిచేస్తుంది. రక్తపోటులో తేడా వస్తుంది. రక్తంలో చక్కెర శాతం ఎక్కువ కనిపిస్తుంది. చాలాకాలంగా మద్యానికి అలవాటైనవారికి కాలేయ సమస్యలు బయటపడతాయి. వెన్ను నొప్పులు, కీళ్లనొప్పులు... ఏవో ఒకటి. అన్నీ శృంగార జీవితం మీద ప్రభావం చూపేవే.

నలభైదాటిన పురుషుల్లో యాభైరెండు శాతానికి పైగా అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్టు అంచనా. అందుకు ప్రధాన కారణం మధుమేహమే. అధికరక్తపోటు కూడా తాత్కాలిక నపుంసకత్వానికి కారణమవుతుంది. కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల వచ్చే హైపర్‌లిపీడెమియా కూడా శృంగార సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. పక్షవాతం, మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌, పార్కిన్సన్స్‌, అల్జీమర్స్‌ వంటి వ్యాధులూ మగటిమిని మట్టికరిపిస్తాయి. ఈ సమస్యలన్నీ కట్టకట్టుకుని నడివయసులోనే వస్తాయని కచ్చితంగా చెప్పలేం కానీ, నలభై పైబడిన శరీరానికి మునుపటి వ్యాధి నిరోధకత ఉండదు. అందుకే సరిగ్గా ఆ సమయంలోనే రోగలక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. రక్తపోటు, గుండెజబ్బు తదితర రుగ్మతలకు వాడే మందులు కూడా అంగస్తంభన సమస్యలకు కారణం కావచ్చు. యాంటీ డిప్రెసెంట్స్‌ (డిప్రెషన్‌కు వాడే మందులు) లైంగిక సామర్థ్యానికి సవాలు విసురుతాయి. అయినా భయపడాల్సిన పన్లేదు. శృంగారానికి శాశ్వతంగా దూరం కానవసరంలేదు. దాదాపు 90 శాతం లైంగిక సమస్యల్ని మందులతో నయం చేయవచ్చని భరోసా ఇస్తారు సెక్సాలజిస్టులు. 'పురుషుల్లో చాలావరకు శారీరక కారణాలవల్లే లైంగిక సమస్యలు వస్తుంటాయి. కానీ, ఒత్తిడివల్లో టెన్షన్స్‌ వల్లో తమ సామర్థ్యం సన్నగిల్లిందని సర్దుకుపోయేవారే ఎక్కువ' అంటారు ఆండ్రాలజిస్ట్‌ సుధాకర్‌ కృష్ణమూర్తి.

నడివయసు మహిళల్లో...సెక్స్‌ మీద ఆసక్తి తగ్గిపోవడం, భావప్రాప్తి సమస్య, జననేంద్రియాలు పొడిబారిపోవడం, భరించలేనంత నొప్పి తదితర సమస్యలు కనిపిస్తాయి. పురుషుడి వైఫల్యానికి కారణమైన అనారోగ్యాలే ఆమెనూ బాధిస్తాయి. రక్తపోటు, మధుమేహం, మానసిక వ్యాధులు, గర్భాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు... ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్త్రీ జడత్వానికి కారణం కావచ్చు. పురుషుల్లో అయినా, స్త్రీలలో అయినా లైంగిక సమస్యల్ని తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదు. కొన్నిసార్లు అవి ఏ హృద్రోగానికో పక్షవాతానికో సంకేతాలు కావచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.
ార్మోన్ల దాగుడుమూత
...ఆ ఆనందం రోజూ కావాలని పోరే చిలిపి శ్రీవారికి రసికాగ్రేసరుడంటూ పూలకిరీటం తొడగలేం. పక్షానికోసారి ముచ్చట తీర్చుకునే వెుక్కుబడి భర్తని బొత్తిగా సరసం తెలియని మనిషని ఈసడించుకోనూలేం. తహతహలాడినా తలతిప్పుకు పడుకున్నా...అంతా హార్మోన్ల మహత్యం! నడివయసు మనుషులంటే వాటికెందుకో చిన్నచూపు. కోతలు విధించి కష్టాలపాలు చేస్తాయి. ఆ ఫలితమే మగవారిలో ఆండ్రోపాజ్‌, మగువల్లో మెనోపాజ్‌. మెనోపాజ్‌తో స్త్రీ సంతాన సామర్థ్యం కోల్పోతుంది. ఆండ్రోపాజ్‌ పురుషుడికి ఆ ఇబ్బందేం ఉండదు. కాకపోతే, టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తి క్రమక్రమంగా పడిపోతుంది. అతనిలోని పురుషత్వానికి ప్రతీక ఆ హార్మోనే. రోషం, తెగువ, గాంభీర్యం... అన్నీ టెస్టోస్టెరాన్‌ ఇచ్చిన కానుకలే. దాని ఉత్పత్తి తగ్గిపోయిందంటే, అతనిలోని శృంగారశక్తీ సన్నగిల్లుతున్నట్టే.

ఈస్ట్రొజెన్‌, ప్రొజెస్ట్రాన్‌ తదితర హార్మోన్లు స్త్రీ జీవితాన్ని మార్చేస్తాయి. ఆమెను మెనోపాజ్‌దశకు తీసుకెళ్తాయి. సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తి మందగించడంతో ఆమెలో శృంగారేచ్ఛ తగ్గుముఖం పడుతుంది. కానీ సెక్స్‌ ఆలోచనలు మాత్రం ఉంటాయి. కాబట్టే, మెనోపాజ్‌ా అంటే, శృంగార జీవితానికి రిటైర్మెంట్‌ లాంటిదని అనుకోడానికీ వీల్లేదు.

వయసు కంటే, హార్మోన్ల ఉత్పత్తి కంటే...'జీవితంలోని నాణ్యత' మన శృంగార సామర్థ్యం మీద అపారమైన ప్రభావం చూపుతుంది. యవ్వనం నుంచే చక్కని ఆహార అలవాట్లు, క్రమంతప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లు, పాజిటివ్‌ దృక్పథం అలవరచుకుంటే... ఆండ్రోపాజ్‌, మెనోపాజ్‌ లక్షణాల తీవ్రత నామమాత్రంగా ఉంటుందని పరిశోధనలు నిరూపించాయి.
నలభై దాటాయంటే...యువకుల్లో వృద్ధులు, వృద్ధుల్లో యువకులని అర్థం. ఎన్ని మందులు వాడినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ దశలో పాతికేళ్ల వయసులోని తహతహ ఉండకపోవచ్చు, ముప్ఫైలలోని సామర్థ్యం సన్నగిల్లొచ్చు. కోరిక పురులు విప్పకపోవచ్చు. తలచుకోగానే తనువు సహకరించకపోవచ్చు. అది సహజం. పరిణామక్రమంలో ఓ భాగం. ఏ వయసుకాపరుగు. ఏ పరుగుకా ఆనందం. ఆ సూక్ష్మం గ్రహిస్తే చాలు. నడివయసు పడకజీవితం నిశ్చింతగా సాగుతుంది.

'శృంగారమంటే శారీరకంగా ఏకం కావడం ఒక్కటే కాదు, మానసికంగా దగ్గర కావడమన్నదీ చాలా ముఖ్యం. దానికి లైంగిక సామర్థ్యంతో పన్లేదు' అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ దగ్గరితనం కోసం ఆరాటపడినంతకాలం, ఏ హార్మోన్లూ ఆలూమగల పడకల్ని వేరుచేయలేవు. ఆ జంట రెండో హనీమూన్‌కు ఏర్పాట్లు చేసుకోవచ్చు.


ఇలా...గెలవాలి!

యోగా

యోగాతో నడివయసు సంక్షోభాన్ని సులభంగా గట్టెక్కవచ్చు. యోగాసనాలు శరీరంలోని ఎండోక్రైన్‌ వ్యవస్థను క్రమబద్ధీకరించి, లైంగిక సామర్థ్యాన్ని పెంచే హార్మోన్ల ఉత్పత్తికి సహకరిస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. జానుశీర్షాసనం, వజ్రాసనం, సర్వాంగాసనం... తదితర ఆసనాలు శృంగార సామర్థ్యాన్ని రెట్టిస్తాయని నిపుణులు చెబుతున్నారు. యోగా అనే కాదు... వ్యాయామం, నడక, ఏరోబిక్స్‌ ఏదో ఓ వ్యాపకం తప్పకుండా ఉండాలి.
ధ్యానం

ధ్యానం మనసుకు కళ్లెమేస్తుంది. ఆలోచనల మీద అదుపు సాధించిపెడుతుంది. ఆ అనుభవం పడకగదిలోనూ పనికొస్తుంది. అతనికి ఆమె. ఆమెకు అతను. ఇద్దరూ ఒక్కటయ్యే క్షణంలో... ఆఫీసు చికాకులూ వ్యాపార లావాదేవీలూ బుర్ర సందుల్లోంచి తొంగిచూడవు. మనసును గెలిచినవారికి మదనసామ్రాజ్యాన్ని గెలవడం పెద్ద కష్టమేం కాదు!
ఆహారం

ఎంత పిండికి అంత రొట్టె. ఎంత తిండికి అంత శక్తి. మనం తినే భోజనంలో విటమిన్లు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు సమృద్ధిగా ఉండాలి. అందులోనూ...అల్లం, వెల్లుల్లి, ఉల్లి, మునగ, ఇంగువ తదితరాల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణాలు ఉన్నట్టు ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. సోయా మెనోపాజ్‌ తీవ్రతను తగ్గించగలదని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఓట్స్‌లోని ఔషధగుణాన్నీ ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు.
అలవాట్లు

అలవాట్ల ప్రభావం పడకగదిలోనూ కనిపిస్తుంది. మద్యం, ధూమపానం, ఓ పద్ధతంటూలేని భోజన విధానం, వ్యాయామంలేని శరీరం, హద్దుల్లేని తిరుగుళ్లూ తద్వారా వచ్చే వ్యాధులు...అన్నీ కలిసి శృంగార జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. మంచి అలవాట్లు ఉన్నవారే, పడకగదిలోనూ మంచి భాగస్వామి అనిపించుకోగలరు.
ఏకాంతం

ఓ వయసుకు వచ్చేసరికి భార్యాభర్తలకు వ్యక్తిగత జీవితమంటూ లేకుండా పోతుంది. చేతికొచ్చిన పిల్లలు, వాళ్ల చదువులు, పుస్తకాలు, ఫారిన్‌ ప్రయాణాలు, పెళ్లిళ్లు... ఆ బాధ్యతల నడుమ పుట్టినరోజులు, పెళ్లిరోజులు కూడా గుర్తుండవు. అది సరికాదు. ఆలూమగలకు 'మాదీ' అన్న ఏకాంత ప్రపంచం ఉండితీరాలి. ఏడాదికో వారం రోజులు... ఇద్దరే చెట్టాపట్టాలేసుకుని ఏ కొడైకెనాల్‌కో వెళ్లిరావచ్చు. ఎన్ని పనులున్నా తీరిక చేసుకుని చిలిపి ఎస్సెమ్మెస్‌లు ఇచ్చిపుచ్చుకోవచ్చు. వారాంతాల్లో రొమాంటిక్‌ మూవీస్‌కు వెళ్లొచ్చు. ఆ సాన్నిహిత్యం శృంగార జీవితాన్ని ఉత్సాహభరితం చేస్తుంది.
వైద్యం

నూటికి ఎనభైమంది లైంగిక సమస్యల్ని బయటికి చెప్పుకోడానికి ఇష్టపడరు. డాక్టరు దగ్గరికెళ్లడానికి సాహసించరు. ఏవో భయాలూ అపోహలూ. ఈ దశాబ్దకాలంలో లైంగిక వైద్యం అపారంగా అభివృద్ధి చెందింది. కొత్తకొత్త మందులు, శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అంగస్తంభన సమస్య, శీఘ్రస్కలనం, తాత్కాలిక నపుంసకత్వం వంటి నడివయసు సమస్యల నుంచి బయటపడటం పెద్ద కష్టమేం కాదు.

___ writer: karanam janardan rao
___ cortesy : EENADU sunday

No comments: