Sunday, January 3, 2010

హాలెండ్‌ అమ్మాయి.. తెలుగు భాష

సేవకు, మానవత్వానికి హృదయం ఉండాలి. ప్రాంతంతో సంబంధం ఏముంది... అన్న ఆలోచనే హాలెండ్‌ అమ్మాయి హెన్రికాను అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేలా చేసింది. తునికి దగ్గర్లోని చామవరంలో ఏ ఆసరాలేని వందమంది చిన్నారులకు ఆశ్రమం నిర్మించే స్ఫూర్తినందించింది.ఆటలు, పాటలు, విందు, వినోదాలతో కాలక్షేపం చేయాల్సిన వయసులో అసలిక్కడికి రావడానికి ఏమిటి ప్రేరణంటే... ఆమె నేపథ్యం, మనసులోనిసేవా భావనని చెప్పక తప్పదు.
అమ్మ ప్రభావంతో...
తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఉంటుందన్నది ఈమెకి అతికినట్టు సరిపోతుంది. హెన్రికా తల్లి అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థలో కౌన్సెలర్‌. మత్తు మందుల వాడకానికి చిన్నారులను దూరంగా ఉంచేందుకు కృషి చేస్తోంది. తండ్రి ఒక సంస్థలో ఉన్నతోద్యోగి. చిన్నప్పట్నుంచి హెన్రికాకు పిల్లలంటే ప్రాణం. తల్లి సేవా కార్యక్రమాలను దగ్గర్నుంచి చూసీ ఎంతో ఆనందపడేది. ఆర్నెల్ల క్రితం డిగ్రీ పూర్తిచేసి ఇంట్లో ఖాళీగా ఉన్న హెన్రికా త్వరగా యూనివర్సిటీలో చేరాలని తపన పడింది. సరిగ్గా ఆ సమయంలోనే... తల్లి స్నేహితురాలు లిండా వాళ్లింటికి రావడంతో ఆమె ఆలోచనలు దారి మళ్లాయి. ముందు సేవ, చదువు తరవాత అన్న తీరు కనబరిచేలా చేశాయి.

సేవే మిన్న
కొన్ని వారాల వ్యవధిలో హెన్రికా ఇండియా రావాలన్న నిర్ణయం జరిగిపోయింది. అదెలాగో ఆమె మాటల్లోనే చదవండి. 'తునిలో ఆశీర్వాద్‌ అనాథాశ్రమం ఉంది. దాన్లో వందమంది పిల్లలున్నారు. వారి వసతికి, చదువుకి మనం ఏదయినా చేస్తే బావుంటుంది అని లిండా ఆంటీ అమ్మతో చెప్పింది. అప్పటికే అక్కడికెళ్లొచ్చిన ఆంటీ అక్కడి పరిస్థితులు, చేయాల్సిన కార్యక్రమాలపై చాలాసేపు మాట్లాడింది. అప్పుడుతట్టింది నాకొక ఆలోచన. ఖాళీగా కూర్చోవడం కన్నా ఆ మంచి పనిలో నేనెందుకు భాగస్వామ్యం తీసుకోకూడదు అని. అమ్మతో చెప్పా. మొదట చదువుకో తరవాత అలాంటి పనులకు వెళుదువు గానీ అంది. యూనివర్సిటీలో చేరేందుకు ఇంకా ఏడాది సమయముంది. ఆ లోపు ఈ సేవా కార్యక్రమంలో పాలుపంచుకొంటానని ఒప్పించా' అంటూ క్రితం ఆగస్టులో జరిగిన విషయాలను పూసగుచ్చింది హెన్రికా.

పిల్లల కోసం తెలుగు...
కాలేజీలో సమావేశాలు, స్టేజీ షోలతో చిన్న మొత్తాల సమీకరణ ప్రారంభించింది. బంధుమిత్రులు, అమ్మానాన్నల సహోద్యోగుల నుంచి ఆర్థిక సహకారం కోరింది. సమకూరిన మొత్తంతో నాలుగు నెలల క్రితం తుని చేరుకుంది. ఆమె వెంట నాన్న, లిండా ఆంటీ. వచ్చీ రాగానే చిన్నారుల్లో ఒకరుగా కలిసిపోయిన ఆమె వసతి గృహం నిర్మాణానికి సన్నాహాలు ఆరంభించింది. 'వచ్చిన కొత్తలో ఇక్కడి వారి గురించి ఏమీ తెలియదు. కానీ అక్కా అంటూ ఆప్యాయంగా అక్కున చేరడం నన్ను కదిలించింది. అంత దూరం నుంచి నేనిక్కడికి రావడం వందశాతం మంచి నిర్ణయం అని అర్థమైంది' అంటోన్న ఆమె పిల్లలతో మమేకమై ఆడిపాడి చేరువయ్యేందుకు పట్టుబట్టి మూడు నెలల్లో తెలుగు భాష నేర్చుకొంది. చీరకట్టు అలవాటు చేసుకుంది.

మరో వంద మందికి నీడ...
పదిమంది పిల్లలతో 2003లో ఆరంభమైన ఆశీర్వాద్‌లో నేడు వందమంది పిల్లలున్నారు. తునిలో అద్దె భవనమే వారికి నీడ. చదువు, వసతి, నిర్వహణ కోసం భారీ ఖర్చే. ఈ పరిస్థితుల్లో దగ్గర్లోని చామవరంలో శాశ్వత వసతి గృహం కోసం హెన్రికా ముందుకు రావడం కొండంత వూరట. ఉదయం నుంచి సాయంత్రం వరకూ దగ్గరుండి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న హెన్రికా చీకటిపడ్డాక పిల్లలకు ఆంగ్లం నేర్పిస్తోంది. మొదట్లో ఆహారం సరిపడక ఇబ్బందిపడినా ఇప్పుడు పిల్లలందరితో కలిసి చక్కగా భోంచేస్తోంది. మరో ఐదారు నెలల్లో భవన నిర్మాణం పూర్తిచేసి స్వదేశానికి వెళతానంటున్న ఆమె చదువు పూర్తయ్యాక మరిన్ని సేవా కార్యక్రమాలకు మద్దతునందిస్తానని చెబుతోంది. ఈ టీనేజీ అమ్మాయి సేవా స్ఫూర్తితో అక్కడున్న వంద మంది చిన్నారులకే కాదు... మరో వందమంది బాలలకూ ఆశ్రయం అందించే ఏర్పాటు కలగనుండటం విశేషం.

courtesy- eenadu

No comments: