Monday, June 8, 2009

స్థన సౌందర్యం- ఇంప్లాంట్ పద్ధతులు


సర్జరీ శిల్పం

శరీరం.. ఓ కళాత్మక సృష్టి! అణువణువునా సౌష్ఠవం.. ఎక్కడికక్కడ పొందికగా ఒదిగిపోయే అవయవ సౌందర్యం.. శరీరానికి శోభనిస్తాయి. అందాన్నీ.. ఆత్మవిశ్వాసాన్నీ ఇనుమడింపజేస్తాయి. అందుకే ఈ సౌష్ఠవం కాస్త అటూఇటూ అయితే.. ఎంతోమంది మానసికంగా మధనపడతారు. రొమ్ముల విషయంలో ఈ సమస్య చాలా ఎక్కువ.
రొమ్ములు ఎక్కువున్నా ఇబ్బందే.. తక్కువున్నా ఇబ్బందే! రొమ్ములు పెరగకపోతే అమ్మాయిలు చిన్నబోతుంటారు.. తమకు పెద్దగా పెరిగితే అబ్బాయిలు చికాకు పడుతుంటారు. అందుకే 'ప్లాస్టిక్‌ సర్జరీ' విభాగం ఈ ఎక్కువ తక్కువలను సౌందర్యాత్మకంగా సరిచేసే సురక్షిత విధానాలను ఆవిష్కరించింది. ఈ సర్జరీలను ఎవరికి చేస్తారు? ఎలా చేస్తారు? ఫలితాలు ఎలా ఉంటాయి.. ఇవన్నీ స్థూలంగా పరిచయం చేస్తోంది ఈ వారం సుఖీభవ!

సైజు పెంచటం (బ్రెస్ట్‌ ఆగ్యుమెంటేషన్‌)
ఎవరికి: రొమ్ములు తగినంత సైజు పెరగని వారికి.. సైజు చిన్నగా ఉన్నాయని మధనపడుతున్న వారికి ఉపయోగపడే సర్జరీ ఇది. దీనికి ముందు అసలు రొమ్ములు పెరగకపోవటానికి కారణం ఏమిటన్నది చూస్తారు. పోషకాహారలోపం, హార్మోన్ల సమస్యలతో ఇలా పెరగకపోవచ్చు. ఇవేమీ లేకపోయినా చాలామందిలో వంశపారంపర్యంగానే రొమ్ముల సైజు చిన్నగా ఉంటుంది. వీరికి సైజు పెంచేందుకు సర్జరీ చెయ్యచ్చు.
ఏ వయసులో: సాధారణంగా ఆడపిల్లల్లో రొమ్ముల పెరుగుదల 11-12ఏళ్ల నుంచీ ఆరంభమై 16-18 ఏళ్ల యుక్తవయస్సు వరకూ కొనసాగుతుంది. కాబట్టి రొమ్ములు పెంచే సర్జరీ చాలావరకూ 16 ఏళ్ల తర్వాతే చేస్తారు. (అరుదుగా సినిమా స్టార్స్‌ వంటివారు వృత్తి అవసరాల రీత్యా కాస్త ముందుగానే చేయించుకుంటుంటారు.)
ఎలా చేస్తారు: సైజు పెంచేందుకు ప్రధానంగా రొమ్ముల లోపల కృత్రిమ 'ఇంప్లాంట్‌' అమరుస్తారు. ఈ ఇంప్లాంట్‌లలో రెండు రకాలున్నాయి. 1. సెలైన్‌ నింపిన ఇంప్లాంట్‌: ఇది సిలికాన్‌తో తయారైన సంచీలాంటి తిత్తి. దీన్ని రొమ్ము లోపల అమర్చి.. అది కావాల్సినంత సైజుకు ఉబ్బేంత వరకూ సెలైన్‌ నింపి మూసివేస్తారు.2. సిలికాన్‌ ఇంప్లాంట్‌. బెలూన్‌లాంటి మృదువైన తిత్తి లోపల సిలికాన్‌ జెల్‌ నింపి ఉంటుంది. దీన్ని రొమ్ముల్లో అమరుస్తారు.
ఈ రెంటితో కూడా లాభాలున్నాయి, చిన్నచిన్న ఇబ్బందులూ ఉంటాయి.
సెలైన్‌ ఇంప్లాంట్‌.. ప్రయోజనాలు:
1. దీన్ని రొమ్ముల దగ్గర చాలా చిన్న కోతతోనే లోపల అమర్చవచ్చు. 2. ఒకవేళ ఎప్పుడన్నా దెబ్బల వంటివి తగిలి లేదా బాగా ఒత్తిడి పడి.. దీని నుంచి సెలైన్‌ రొమ్ముల్లోకి లీక్‌ అయితే.. ఆ సెలైన్‌ మన శరీరంలో కలిసిపోతుంది. ఎటువంటి నష్టమూ ఉండదు. 3. సెలైన్‌ లీక్‌ అయినప్పుడు రొమ్ముల సైజు తగ్గిపోయి, ఆ విషయం మనకు వెంటనే తెలుస్తుంది. అప్పుడు కావాలంటే ఇంప్లాంట్‌ను తీసెయ్యచ్చు.
ఇబ్బందులు:
1.
పెట్టేటప్పుడు దానిలో తగినంత సెలైన్‌ నింపకపోయినా.. లేక కాలక్రమేణా అందులో సెలైన్‌ కొద్దిగా తగ్గినా లోపలి నుంచి నీళ్లు కదులుతున్నట్టు గలగల శబ్దం రావచ్చు, ఇది చాలా అరుదు. 2. రొమ్ములను నొక్కితే మృదువుగా నెమ్మదిగా యథాస్థితికి రావటం కాకుండా నీటితిత్తిలా వెంటనే సర్దుకుంటాయి.


సిలికాన్‌ జెల్‌ ఇంప్లాంట్‌.. ప్రయోజనాలు:
1. చాలా మృదువుగా అత్యంత సహజంగా అచ్చం రొమ్ము కణజాలంలాగే లోపల ఒదిగిపోతుంది. ఏమాత్రం తేడా తెలియదు.
ఇబ్బందులు:
1. అమర్చటానికి ముందే దీనిలో జెల్‌ నింపి ఉంటుంది కాబట్టి దీన్ని లోపల అమర్చేందుకు కొద్దిగా పెద్దకోత అవసరమవుతుంది. 2. చాలా అరుదుగా ఇంప్లాంట్‌ చిరిగి లేదా పగిలి ఆ జెల్‌ లోపల లీక్‌ అయితే అదిచిక్కగా అలాగే ఉండిపోతుంది కాబట్టి అది లీక్‌ అయిన విషయం మనకు అస్సలు తెలియదు. దానిచుట్టూ మందపాటి కండ ఏర్పడి దానితో దీర్ఘకాలంలో కొన్ని ఇబ్బందులు రావచ్చని సంశయాలున్నాయి. అయితే ఇది చాలా చాలా అరుదనే చెప్పాలి.
ఎలా అమరుస్తారు: దీనికి ప్రధానంగా మూడు పద్ధతులున్నాయి. 1. చనుమొన చుట్టూ ఉండే నల్లటి వలయం అంచు వెంబడి కొద్దిగా కోతబెట్టి దాని గుండా ఇంప్లాంట్‌ను లోపలకు పంపించి.. తిరిగి దాన్ని కుట్టెయ్యటం. దీనివల్ల రొమ్ముల మీద ఎటువంటి మచ్చలూ ఏర్పడవుగానీ.. కొద్దిమందిలో కోతబెట్టినంత మేరా సన్నటి గీతలా మందంగా అనిపించవచ్చు. ఈ పద్ధతిలో సెలైన్‌ ఇంప్లాంట్‌ పెట్టటం తేలిక.

2. రొమ్ము కిందే గుండ్రంగా సుమారు రెండు అంగుళాల మేర కోతబెట్టి దాని గుండా ఇంప్లాంట్‌ లోపలికి పంపించి తిరిగి కుట్టెయ్యటం. ఇలా కాస్త పెద్దకోత పెట్టవచ్చు కాబట్టి పెద్దసైజులో ఉండే సిలికాన్‌ జెల్‌ ఇంప్లాంట్‌ పెట్టేందుకు ఇది బాగా పనికొస్తుంది. కోత తాలూకూ మచ్చ రొమ్ము కింద ఉండి బయటకు ఏమీ కనబడదు.
3. అసలు రొమ్ముల దగ్గర ఎటువంటి కోతలూ వద్దనుకుంటే చంకలో సన్నటి కోత బెట్టి.. దాని నుంచి లోపల్లోపలే రొమ్ముల వరకూ వచ్చి ఇంప్లాంట్‌ అమర్చటం. కాస్త ఎక్కువ సమయం పట్టినా ఇలా ఏ రకం ఇంప్లాంట్‌నైనా పెట్టొచ్చు. చంకలో కోత చాలా త్వరగా మానిపోతుంది, మచ్చలు కూడా కనబడవు.
సర్జరీ తర్వాత..?: సాధారణంగా రెండు రొమ్ములకూ ఒకేసారి.. రెండూ ఒకే సైజు ఉండేలా అన్నీ సరిచూసి సర్జరీ చేస్తారు. సర్జరీ తర్వాత ఒక నెలపాటు 'సపోర్టింగ్‌ బ్రా' వేసుకోమంటారు. ఇంప్లాంట్‌ బరువుకు కుట్లు సాగకుండా.. కోత త్వరగా మానిపోయేందుకు ఇది బాగా సహాయపడుతుంది. ఒకటి, రెండు రోజుల్లో నొప్పి వంటివన్నీ తగ్గిపోతాయి. వారంలో మామూలు పనులకు వెళ్లిపోవచ్చు. ఓ నెలపాటు ఆ ప్రాంతం మొద్దుబారినట్లు ఉండొచ్చు. తర్వాత అన్నీ సర్దుకుంటాయి.
సమస్యలేమీ ఉండవా?: చాలాచాలా అరుదుగా సర్జరీ తర్వాత కొద్దిరోజుల్లో- ఇన్ఫెక్షన్‌ రావచ్చు. కొద్దిరోజుల తర్వాత కూడా కుట్ల నుంచి స్రావాలు కారుతుండటం దీని లక్షణం. ఈ ఇన్ఫెక్షన్‌ వస్తే మాత్రం వెంటనే ఇంప్లాంట్‌ తీసెయ్యాల్సిందే. రెండు మూడు నెలల తర్వాత మళ్లీ పెట్టొచ్చు. ఇది చాలా అరుదనే చెప్పుకోవాలి. కోత మానిపోయిన తర్వాత ఇంకే ఇబ్బందీ ఉండదు. క్రమేపీ మచ్చ కూడా కలిసిపోతుంది. దీర్ఘకాలంలో- ఇంప్లాంట్‌ ఎన్నేళ్త్లెనా లోపల ఉండిపోతుంది. ఇతరత్రా కారణాలతో ఎవరైనా తీసేయించుకోవాలనుకుంటే ఎప్పుడైనా తీసేయించుకోవచ్చు. లోపల ఇంప్లాంట్‌ ఎలా ఉందో తెలుసుకోవటానికి అప్పుడప్పుడు మామోగ్రామ్‌ చేయించుకోవాలని సూచిస్తారు.
బిడ్డకు పాలు:
ఇంప్లాంట్‌ రొమ్ము వెనకాలగా ఉంటుంది కాబట్టి రొమ్ము కణజాలం
, క్షీర గ్రంథులకు ఏ ఇబ్బందీ ఉండదు. లోపల ఇంప్లాంట్‌ ఉన్నా బిడ్డకు చక్కగా పాలివ్వచ్చు.
ఇటీవలి కాలంలో- ఒంట్లో అదనంగా ఉన్న కొవ్వును లైపోసక్షన్‌ ద్వారా తొలగించి.. ఆ కొవ్వును రొమ్ముల్లోకి ఎక్కించి సైజు పెంచే విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. కాకపోతే అలా ఎక్కించిన కొవ్వు రొమ్ముల్లో త్వరత్వరగా కరిగిపోతుండటం, దీంతో ఈ ప్రక్రియను మూడునాలుగుసార్లు చెయ్యాల్సి వస్తుండటంతో.. ఈ విధానం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు.
బిగువు పెంచటం (మ్యాస్టోపెక్సీ)
ఎవరికి: రొమ్ములు బాగా సాగిపోయిన వారికి ఇది ఉపయోగపడుతుంది.బిడ్డకు పాలిచ్చే సమయంలో రొమ్ముల సైజు పెరిగి.. ఆ తర్వాత సహజంగానే తగ్గాలి. కానీ కొందరికి తగ్గకుండా అలాగే ఉండి సాగినట్లు తయారవుతాయి, ముఖ్యంగా కాస్త లేటు వయసులో బిడ్డలను కన్నవారికి ఈ సమస్య ఎక్కువ. వీరిలో చర్మం సాగినట్త్లె తిరిగి బిగువుగా మారదు. దీంతో ఇబ్బంది పడుతుంటారు. వీరందరికీ రొమ్ముల సైజు తగ్గించేందుకు వేరే మార్గాలేం లేవు. సర్జరీనే ఉపయోగపడుతుంది.
ఏ వయసులో: సాధారణంగా కాన్పుల తర్వాత.. బిడ్డకు పాలిచ్చిన తర్వాత.. 35, 45 ఏళ్ల తర్వాత ఇది అవసరమవుతుంటుంది.
ఎలా చేస్తారు: చాలావరకూ కోతలన్నీ రొమ్ములను తగ్గించే సర్జరీలాగే ఉంటాయి. కాకపోతే దీనిలో సాగిపోయిన రొమ్ము భాగాలను పైకి బిగువుగా లాగి.. కుట్ల దారంతో రొమ్ములపైన ఉండే పెక్టోరల్‌ కండరానికి కుడతారు. దీంతో రొమ్ములు సాగినట్లుండకుండా బిగువుగా మారతాయి. క్రమేపీ ఆ కుట్లు ఒంట్లో కలిసిపోయి.. రొమ్ము అలా పైకి లాగినట్లుగానే ఉండిపోతుంది. రొమ్ములు మరీ పెద్దగా ఉంటే మాత్రం రొమ్ము కణజాలాన్ని కూడా కొంత తగ్గిస్తారు.


సర్జరీ తర్వాత..?: అంతా రొమ్ము తగ్గించే సర్జరీలాగే ఉంటుంది.
సైజు తగ్గించటం (బ్రెస్ట్‌ రిడక్షన్‌)
ఎవరికి: కొద్దిమందికి వంశపారంపర్యంగానూ, హార్మోన్ల అసమతౌల్యం కారణంగానూ.. యుక్తవయసులో రొమ్ముల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకోసారి ఒక రొమ్ము సహజంగానే పెరిగి, రెండోది ఎక్కువగా పెరగొచ్చు. వీటివల్ల ఆడపిల్లలు తోటివారి మధ్య, సమాజంలో చాలా నగుబాటుకు గురవుతుంటారు. ఎదుటివారి కళ్లు ముందుగా వీరి ముఖం మీద కంటే రొమ్ముల మీద పడుతుంటాయి. కొన్నిసార్లు పెద్దగా ఉండే రొమ్ముల కారణంగా గూనిలా భుజాల ముందుకు వంగినట్లవటం, వెన్నునొప్పి వంటి బాధలూ వేధిస్తాయి. పెద్దపెద్ద రొమ్ములు ఒకదానితో ఒకటి రుద్దుకుని ఒరుసుకుపోవటం వంటి ఇబ్బందులూ తలెత్తవచ్చు. మరికొన్నిసార్లు- బిడ్డకు పాలిచ్చే సమయంలో రొమ్ముల సైజు పెరిగి.. ఆ తర్వాత తగ్గకుండా అలాగే ఉండిపోతుంది. దీంతో వీరూ ఇబ్బంది పడుతుంటారు. వీరందరికీ రొమ్ముల సైజు తగ్గించే సర్జరీతో మేలు జరుగుతుంది. సౌందర్యం కంటే ముఖ్యంగా ఇది సౌకర్యానికి సంబంధించినది కాబట్టి కొన్ని వైద్యబీమాల కింద కూడా కవర్‌ చేస్తున్నారు.
ఏ వయసులో: సాధారణంగా ఎదిగే వయసు పిల్లలకు.. రొమ్ముల పెరుగుదల ఆగిపోయిన తర్వాత.. అంటే 16-18 ఏళ్ల వయసులో చేస్తారు. మరీ ఎక్కువగా ఉంటే మరికాస్త ముందు చెయ్యచ్చు.
ఎలా చేస్తారు: బాగా యుక్తవయస్సులో ఉన్నవారికి రొమ్ముల సైజు కొద్దిగా తగ్గించాలంటే కేవలం కొవ్వును మాత్రమే తొలగించే 'లైపోసక్షన్‌' చెయ్యచ్చు. మరీ పెద్దగా ఉంటే మాత్రం సర్జరీ చేసి.. రొమ్ములో సాధారణంగా కింది భాగం తొలగిస్తారు. దీనికి రకరకాల పద్ధతులున్నాయి. ప్రధానంగా- కిందికి బాగా జారినట్లుండే చనుమొన భాగాన్ని పైకి తీసుకువెళతారు. అందుకోసం ముందు రొమ్ము పైభాగాన ఒక రంధ్రం ఏర్పాటు చేస్తారు. అప్పుడు చనుమొన నల్లటి వలయం చుట్టూ లోతుగా కోతబెట్టి.. దాన్ని కండ, క్షీరనాళాలు, రక్తనాళాలతో సహా మొత్తాన్ని పైన ఉండే రంధ్రంలోకి మారుస్తారు. అప్పుడు కింది రొమ్ము భాగంలో ఎంతకావాలంటే అంత తగ్గించేసి.. మిగిలిన రెండు అంచులను దగ్గరకు తెచ్చి కుట్టేస్తారు. దీంతో రొమ్ము పరిమాణం తగ్గుతుంది.
సర్జరీ తర్వాత..?: సర్జరీ తర్వాత లోపల రక్తం, స్రావాలు పేరుకోకుండా ఒకరోజు పాటు డ్రైన్‌ గొట్టాలు పెడతారు. 48 గంటల తర్వాత వాటిని తీసేసి బ్యాండేజ్‌ వేసేస్తారు. కొద్దిరోజుల పాటు నొప్పి వంటి చిన్న చిన్న బాధలుంటాయి. ఒకటి రెండువారాల్లో పనులకు వెళ్లిపోవచ్చు. నెలపాటు 'సపోర్టింగ్‌ బ్రా'వాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కుట్లు మానిపోయి ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.
సమస్యలేమీ ఉండవా?: సాధారణంగా ఎటువంటి సమస్యలూ ఉండవు. కొద్దిమందిలో చిన్నచిన్న ఇన్ఫెక్షన్లు, కుట్ల దగ్గర చర్మం నల్లబడటం, స్రావాల వంటివి రావచ్చు. కొద్దిరోజుల పాటు రొమ్ములు మొద్దుబారినట్లుండొచ్చు. అన్నీకూడా కొద్దిరోజుల్లో సర్దుకుంటాయి.
బిడ్డకు పాలు: సైజు తగ్గించటంలో భాగంగా రొమ్ము కణజాలం, క్షీర గ్రంథుల వంటివాటన్నింటినీ కలిపి కొంత భాగం తొలగించారు కాబట్టి రొమ్ము పెద్దగా ఉన్నప్పటితో పోలిస్తే పాలు కొద్దిగా తక్కువ కావచ్చు, కాబట్టి బిడ్డకు ఎక్కువసార్లు పట్టాల్సి వస్తుంది. అవసరమనుకుంటే పైపాలూ ఇవ్వాల్సి రావచ్చుగానీ ఇది అరుదు.
అబ్బాయిల బాధ (గైనకో మాస్టియా)
ఎవరికి: పురుషుల్లోనూ స్త్రీ హార్మోన్లు ఉంటాయి. కొందరు అబ్బాయిలకు ఎదిగే వయసులో ఈ హార్మోన్ల ప్రభావం ఎక్కువై ఆడపిల్లల్లోలాగే రొమ్ములు పెద్దగా పెరుగుతాయి. కొందరికి ఒకటిరెండు ఏళ్లలో ఆగితే మరికొందరికి 20ల్లో అడుగుపెట్టినా పెరుగుతుంటాయి. అమ్మాయిల మాదిరిగా పెద్దగా రొమ్ములు ఉన్నందుకు టీషర్టుల వంటివి వేసుకోవటానికి ఇబ్బంది పడుతూ.. న్యూనతకు గురవుతుంటారు. వీరికి సర్జరీ బాగా ఉపయోగపడుతుంది.
ఏ వయసులో: సాధారణంగా 18 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా చెయ్యచ్చు.
ఎలా చేస్తారు?: కొందరికి రొమ్ముల్లో కేవలం కొవ్వు మాత్రమే పెరిగి.. అవి నొక్కితే చాలా మెత్తగా ఉంటాయి. ఇలాంటి వారికి కేవలం కొవ్వు తొలగించే 'లైపోసక్షన్‌' చేస్తే సరిపోతుంది. కానీ మరికొందరికి రొమ్ము కణజాలం కూడా బాగా ఉండి.. నొక్కితే గట్టిగా కూడా ఉంటాయి. ఇలాంటి వారికి.. లైపోసక్షన్‌తో పాటు కొంత రొమ్ము కణజాలం కూడా తొలగించటం అవసరం. దీనికోసం చనుమొన నల్లటి వలయం అంచుల దగ్గర చిన్నచిన్న కోతలు పెడతారు. వాటి ద్వారా లైపోసక్షన్‌ చేస్తారు. రొమ్ము కణజాలం తొలగించినప్పుడు.. అక్కడ సొట్టల్లా రాకుండా కూడా లైపోసక్షన్‌ ఉపయోగపడుతుంది. సర్జరీ తర్వాత చర్మానికీ, ఛాతీకీ మధ్య ఖాళీ రాకుండా బిగువుగా పట్టి ఉంచేందుకు 'ఛెస్ట్‌ బైండర్‌' అనేది ఇస్తారు. దాన్ని వేసుకుని దానిపైన మామూలుగా బట్టలు తొడుక్కోవచ్చు. అలా ఒక నెల వేసుకుంటే ఎక్కడా తేడా లేకుండా చర్మం చక్కగా అతుక్కుపోతుంది.
మళ్లీ పెరుగుతాయా?: మొత్తం పెరుగుదల అయిపోయిన తర్వాత సర్జరీ చేస్తే మళ్లీ పెరిగే అవకాశం ఉండదు. అలా కాకుండా ముందే చేస్తే మాత్రం ఆ తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.
అందరికీ...
కోతబెట్టిన చోట మచ్చ త్వరగా కలిసిపోయేందుకు.. అందరికీ కూడా మసాజ్‌ బాగా ఉపయోగపడుతుంది. వారం తర్వాత ఆపరేషన్‌ చేసిన చోట.. ఆ కోత ప్రాంతంలో కొన్ని క్రీములు రాస్తూ మృదువుగా రుద్దితే మచ్చ బాగా తగ్గుతుంది. లింఫ్‌ స్రావాల ప్రవాహం పెరిగి అక్కడ వాపు కూడా ఉండదు. ముఖ్యంగా అక్కడ స్పర్శ చాలా త్వరగా మెరుగవుతుంది.
note: plz leave a comment must who read this... if u dont wish to tell ur name give anonymos comment

2 comments:

Anonymous said...

Good Post. Thanks

అబ్బాయిలు 'లైపోసక్షన్‌' లేదా లైపోసక్షన్‌తో పాటు కొంత రొమ్ము కణజాలం కూడా తొలగించుకునే ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పగలరా?

Anonymous said...

www.telugugola.com