సూపర్‌స్టార్ యారున్ను కేట్టాళ్ చిన్న పొణ్ను సొల్లుమ్... (సూపర్‌స్టార్ ఎవరని అడిగితే చిన్న పాపాయి చెబుతుంది) - తమిళనాట రజనీకాంత్ అభిమానులకు ఇష్టమైన వాక్యాలివి. వెండి తెరపై సూపర్‌స్టార్ రజనీ అని అక్షరాలు కనిపించగానే టెంకాయలు పగలడం... పుష్పాభిషేకం జరగడం సర్వసాధారణ విషయాలు. ఆయన సినిమా ఎప్పుడాని లక్షల హృదయాలు ఎదురుచూస్తుంటాయి. అంతగా ఏముంది ఆయనలో...?
'సినిమాల్లోకి రావాలంటే గ్లామరే ముఖ్యం' అనుకుంటే ఆయనసలు హీరోనే కాకూడదు. మెరుపు వేగంతో చిందులేసేవాడే కథానాయకుడు అనుకుంటే రజనీకి అందులోనూ పాస్ మార్కులే! ఆకర్షించే రూపం... ఆరడుగుల ఎత్తే కొలమానాలైతే ఆయన ఎప్పటికీ శివాజీరావ్ గైక్వాడ్‌గానే మిగిలిపోయేవాడు.
మరి ఏముంది ఆయనలో..? మళ్లీ అదే ప్రశ్న. దానికి సమాధానం కొన్ని కోట్ల రజనీ అభిమానులకు తెలుసు. అదే - స్త్టెల్..! అదే ఆయన్ని సూపర్‌స్టార్‌ని చేసింది. దక్షిణభారతంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఆయన నేడు అరవయ్యో యేట అడుగుపెడుతున్నారు.
ఔను... సింహం సింగిల్‌గానే వస్తుంది. అచ్చం రజనీకాంత్‌లాగే. 'రైట్.. రైట్..'- ఈ కండక్టర్ స్త్టెల్‌గా భలే చెబుతున్నాడే... - ఈ ఒక్క ప్రశంసే అతన్ని ప్రభంజనం సృష్టించడానికి తొలి అడుగు వేసేలా చేసింది. ఓ నాటకంలో దుర్యోధనుడిగా వేషం వేస్తే లభించిన ఆదరణ... అతని దృష్టి సినిమా రంగంవైపు మరల్చేలా చేసింది. ఒంటరిగా రంగుల లోకంలోకి వచ్చిన ఆయన బాలచందర్ దగ్గర నేర్చుకొన్న పాఠాలు బతుకు గమనంలో బాటలుపరచాయి. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకునే సమయమే చిక్కలేదు.
సిగరెట్‌ని గాలిలో రెపరెపలాడించి... పెదవులతో అందుకోవడం. కళ్లజోడుని గిర్రున తిప్పి అలంకరించుకునే విధానం.. ఇవన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి మిగిల్చాయి. ఆయన నవ్వులో... మాటలో.. నడకలో ఏదో గమ్మత్తు ఉంది. కథానాయకుడంటే నృత్యాలూ... పోరాటాలూ మాత్రమే చేస్తాడనుకునే వారికి రజనీ శైలి కొత్త రుచులు పంచింది. పంచ్ డైలాగులతో మంత్రజాలం చేయడం వింతగా అనిపించింది. అప్పటి నుంచి రజనీ సినిమా అంటే ఇవి ఉండాల్సిందే అని అభిమానులు ఆశించారు... రజనీ పాటించాడు.
ఇంత బడ్జెట్టా?
అరవయ్యో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న రజనీకాంత్ ఇప్పటికే ఎన్నోసార్లు సినిమాలకు స్వస్తి చెప్పాలనుకొన్నారట. అయితే ఎప్పటికప్పుడు ఏదో శక్తి ఆయన్ని సెల్యులాయిడ్ వైపు లాగుతూనే ఉంది. తొలి దశలో సహాయ పాత్రలూ, ప్రతినాయక పాత్రలూ పోషించిన రజనీ స్థాయి ఇప్పుడేమిటో తెలుసా... మన దేశంలోనే అత్యధిక వ్యయంతో నిర్మితమయ్యే చిత్రంలో కథానాయకుడు కావడం. ఆయన తాజా చిత్రం 'రోబో'కయ్యే ఖర్చు రూ.120 కోట్లు పైమాటే! ఓ ప్రాంతీయ భాష నటుడికి ఈ స్థాయి ఎలా వచ్చింది. ఒకటే కారణం... రజనీ సినిమా అంటే కొన్ని నెలలు ముందుగానే సందడి మొదలైపోతుంది. అభిమానులు వసూళ్లూ... రికార్డులూ అనే లెక్కలు వేసేసుకుంటారు. 'మన సినిమాని వాయిదా వేసుకుంటే మంచిది' అని దక్షిణ భారతాన నిర్మాతలు భావిస్తారు. రజనీ క్రేజ్ అలాంటిది. 'శివాజి' విడుదలైనప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ... ఓ ప్రాంతీయ భాషా చిత్రానికి ఇంత క్రేజా..? అని బాలీవుడ్ సైతం ముక్కున వేలేసుకుంది. మనదేశంలోనే కాదు... అమెరికా, కెనడా, సింగపూర్, చైనా, జపాన్ లాంటి దేశాల్లోనూ అభిమాన గణముంది. కాబట్టే పారితోషికం తీసుకోవడంలోనూ రజనీ నెంబర్ వన్.
నటన కూడా నటనే!
లెక్కలేనంతమంది అభిమానులు... పురస్కారాలు... ఇవేమీ రజనీలోని లోపలి మనిషిని తృప్తి పరచలేదు. 'మీరు పాత్రలో జీవించారు' లాంటి మాటలు రజనీ చెవులు అస్సలు భరించలేవు. 'ఇలాంటి మాటలు వింటుంటే నవ్వొస్తొంది. నేను డబ్బులు తీసుకొని నటిస్తాను. నటించడం నా పని. అంతే- దాని కోసం ఎప్పుడూ నా మనసు లగ్నం చేయలేదు. నా నటన కూడా నటనే' అని ఒప్పుకొనే గుండె ధైర్యం ఎంతమందికి ఉంది? ఓ వెస్పా స్కూటరు... జేబు నిండా సిగరెట్లు.. ఓ సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లు.. శివాజీరావ్ కోరుకున్నవి ఇవే. కానీ వీటికి కొన్ని వేల రెట్లు సంపాదించారు రజనీకాంత్. కానీ ఏదో అశాంతి. 'నా' అనే స్వార్థం వదిలి హిమాలయాలకు వెళ్లిపోవాలనే ఆలోచనలు అప్పుడప్పుడూ ఆయన్ని వెంటాడుతుంటాయి.
నిరాడంబరంగా...
రజనీకాంత్‌కి బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం. ఈ మధ్యనే 'పా' చిత్రం చూస్తూ కన్నీళ్లుపెట్టుకున్నారు. ''అమితాబ్‌తో కలిసి 'అంధా కానూన్', 'గిరఫ్తార్' లాంటి చిత్రాల్లో నటించాను. నేను ఆయన అభిమానిని. ఎందరో విదేశీ నటుల్ని కూడా పరిశీలించా. కానీ అమితాబ్ శైలి వేరు. 'పా' లాంటి చిత్రం ఆయన మాత్రమే చేయగలరు'' అన్నారు. రజనీ షష్టిపూర్తి వేడుకల్ని ఘనంగా చేయాలని అభిమానులు భావించారు. అలాగే ఆయన కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య... కనీసం బంధుమిత్రుల సమక్షంలోనైనా చేయాలని ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు. అయితే రజనీ చిరునవ్వుతో వాటిని వద్దన్నారని తెలిసింది. అయినా ఈ వేడుకల్ని నిరాడంబరంగా చేసే అవకాశాలున్నాయి. శనివారం ఆయన 'రోబో' చిత్రీకరణలో పాల్గొంటారు.
Saturday, December 12, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment