Tuesday, October 27, 2009

స్త్రీ పరివేదన- శృంగారానుభూతి

ఒకప్పుడు ఎంతో హాయినిచ్చి.. సజావుగా సాగిన దాంపత్య జీవితమే ఒక్కోసారి అనూహ్యంగా ఇబ్బందుల్లో పడొచ్చు! శృంగారానుభూతి బాధాకరంగా మారితే దైనందిన జీవితంలో ఆనందం కరవై, అసంతృప్తి రగులుకొంటుంది. చాలామంది స్త్రీలు లైంగికపరమైన ఇబ్బందుల గురించి భాగస్వామితో చెప్పుకోటానికీ, చర్చించటానికే సంశయిస్తుంటారు. ఇక వీటి గురించి వైద్యులతో చర్చించి చికిత్స తీసుకోవటమంటే.. మన సమాజంలో ఎంతోమంది స్త్రీలకు బిడియం, బెరుకు, నగుబాటు! అందుకే ఈ సమస్య నేడు మరింత జటిలంగా తయారైంది.

నిజానికి దంపతులు ఇరువురిలో ఏ ఒక్కరు అసంతృప్తికి లోనవుతున్నా సెక్స్‌ అన్నది సమస్యగా పరిణమిస్తుంది. దాంపత్య జీవితంలో అప్పుడప్పుడు 'విజయాలూ, వైఫల్యాలూ' సహజం. అలాగే ఎంత తరచుగా సెక్స్‌లో పాల్గొంటున్నారన్నది కూడా జంటకూ, జంటకూ మారిపోవచ్చు. ఉదాహరణకు ఒక జంటకు తరచూ సంభోగంలో పాల్గొనకపోయినా పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు. కానీ అదే మరో జంటలో.. (లేదా ఇద్దర్లో ఎవరో ఒకరికి) తీవ్ర అసంతృప్తిని మిగులుస్తూ పెద్ద ఇబ్బందిగానూ తయారవ్వచ్చు. పురుషులలో మాదిరిగానే.. స్త్రీలలో కూడా లైంగిక సమస్యలకు ఎన్నో అంశాలు కారణమవుతాయి. వీటిలో మానసికసమస్యలే ఎక్కువగా ఉండొచ్చుగానీ శారీరకమైన సమస్యలు కూడా దీనికి కారణమవుతాయని గుర్తించటం అవసరం. ఒకప్పుడు స్త్రీల లైంగిక సమస్యలన్నింటినీ కూడా చాలావరకూ మానసిక ఇబ్బందులుగా కొట్టిపారేసేవారు. అయితే తాజా అధ్యయనాలు అది సరికాదని, దీని వెనక శారీరక కారణాలు కూడా ఎక్కువే ఉంటాయని కచ్చితంగా నిర్ధారించాయి. మధుమేహం, గుండెజబ్బులు, కొన్ని రకాల మందులు కూడా స్త్రీలలో లైంగిక సమస్యలను తెచ్చిపెట్టొచ్చు.

ఆ బాధ పురుషులకే కాదు.. స్త్రీలకూ ఉంటుంది! ఆ ఇబ్బంది.. స్త్రీలనూ వేధిస్తుంది. అసలు వాంఛలే కలగకపోవచ్చు. కోర్కె కలిగినా శృంగారం చెప్పలేనంతటి అసౌకర్యంగా మారచ్చు. తృప్తి కానరాకపోవచ్చు. మొత్తానికి దాంపత్య జీవితమే ఇబ్బందిగా తయారవ్వచ్చు! దాదాపు 40% స్త్రీలు లైంగికంగా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు వైద్య ప్రపంచం స్త్రీల లైంగిక సమస్యల మీద మరింత నిశితంగా దృష్టి సారిస్తోంది. వివరాలు ఈ వారం ప్రత్యేకం!


'వాంఛ' జటిలం
లైంగిక వాంఛలు అస్తవ్యస్తం కావటం.. ఎంతోమంది స్త్రీలు ఎదుర్కొనే అతిపెద్ద, సర్వసాధారణ సమస్య. దీని గురించి భాగస్వామితో చర్చించకపోతే అసంతృప్తి, మానసిక వ్యథ మరింతగా పెరుగుతాయి. అలసట, మానసిక కుంగుబాటు, ఒత్తిడి, రకరకాల ఇతర జబ్బులు, భాగస్వామితో సత్సంబంధాలు లేకపోవటం, మద్యానికి బానిస కావటం.. ఇవన్నీ కూడా వాంఛలు సన్నగిల్లేలా చేసి, సెక్స్‌ జీవితాన్ని దెబ్బతీస్తాయి. అలవాటైన గర్భనిరోధక పద్ధతిని మార్చుకున్నా, కొన్ని రకాల మందులు వాడుతున్నా, నెలసరి నిలిచిపోయే వయసు దగ్గపడుతున్నా.. స్త్రీలలో లైంగిక వాంఛలు కొంత తగ్గచ్చు. అలాగే రుతుచక్రంలో కొన్నికొన్ని రోజుల్లోనూ, కాన్పు అయిన తర్వాత కొంతకాలం పాటు శృంగార వాంఛలు తక్కువగా ఉంటాయి. కారణమేదైనా వైద్యపరిభాషలో దీన్ని 'ఇన్‌హిబిటెడ్‌ డిజైర్‌ డిజార్డర్‌' అంటారు. లైంగిక సమస్యలతో వైద్యుల వద్దకు వస్తున్న స్త్రీలలో దాదాపు 80% మందిలో ఏదో స్థాయిలో ఈ సమస్య ఉంటోంది! ఈ సమస్య ఉన్న స్త్రీలలో కొందరు.. సెక్స్‌ పట్ల తక్షణ ఆసక్తి, తక్షణ వాంఛలు లేకపోయినా.. భాగస్వామి లైంగిక పరిచర్యలకు క్రమేపీ బాగానే స్పందిస్తారు, ఆ తర్వాత వాంఛలు, భావప్రాప్తి వంటివన్నీ సహజంగానే అనుభవిస్తారు. మరికొందరు.. భాగస్వామి పరిచర్యలకు ఏమాత్రం స్పందించకపోగా విముఖంగా కూడా ఉండొచ్చు. లైంగిక వాంఛలు తక్కువగా ఉన్నవారు.. భాగస్వామితో సాన్నిహిత్యాన్ని కోరుకుంటూనే సంభోగాన్ని మాత్రం అంతగా ఇష్టపడకపోవచ్చు. భావోద్వేగపరమైన ఈ వైరుధ్యాలు, గందరగోళాలన్నీ కలిసి దాంపత్య జీవితంలో వ్యథకూ, తీవ్రమైన అసంతృప్తికీ కారణమవుతుంటాయి.

చి కామవాంఛలు తిరిగి వికసించేలా చెయ్యటానికి 'సెక్స్‌ థెరపీ' బాగా ఉపకరిస్తుంది. సమస్యల గురించి దంపతులు ఇరువురూ చర్చించుకునేలా ప్రోత్సహిస్తూ.. శృంగారంలో సరికొత్త పద్ధతులు అనుసరించేలా చెయ్యటం ద్వారా దీన్ని అధిగమించవచ్చు. లైంగిక వాంఛలు లేకపోవటం (లాస్‌ ఆఫ్‌ డిజైర్‌), లైంగిక ప్రేరణలు తక్కువగా ఉండటం (లో సెక్స్‌ డ్రైవ్‌).. ఈ రెంటి మధ్యా చాలామంది గందరగోళపడే అవకాశం ఉంది. హార్మోన్ల మార్పులు, థైరాయిడ్‌ సమస్యల వంటి శారీరక కారణాలన్నీ కూడా స్త్రీలలో లైంగిక ప్రేరణలను తగ్గించవచ్చు. వైద్యపరమైన పరీక్షల ద్వారా అసలు సమస్య- వాంఛలు లేకపోవటమా? లేక ప్రేరణలు లేకపోవటమా? అన్నది నిర్ధారించవచ్చు. ఏమైనా ప్రస్తుతం దీనిపైన విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. స్త్రీలలో కామ వాంఛలను తిరిగి పునరుత్తేజింపజేసే ఔషధాల కోసం మందుల కంపెనీలు కూడా బాగా కృషి చేస్తున్నాయి.

నొప్పి బాధాకరం
సంభోగ సమయంలో నొప్పి, బాధ అన్నది రెండు రకాలుగా ఉండొచ్చు.ఒకటి శారీరకంగా అంతర్గత కారణాలకు సంబంధించినది. రెండోది- పైపైని సమస్యల వల్ల వచ్చేది! అంతర్గతమైన నొప్పి- సంభోగ సమయంలో యోని వద్ద స్రావాలుతగినంత లేకపోవటం వల్ల రావచ్చు,కటిప్రాంత అవయవాల్లో వాపు (పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ) వల్ల రావచ్చు, ఎండోమెట్రియోసిస్‌ వంటి శారీరక సమస్యల్లో కూడా రావచ్చు. సాధారణంగా సంభోగ సమయంలో- పురుషాంగ ప్రవేశం, కదలికలు సౌకర్యవంతంగా సాగేందుకు లోపల గర్భాశయం కొద్దిగా పైకి వెళ్తుంది, యోని పెదవులు కొద్దిగా ఉబ్బుతాయి, ఇవన్నీ కూడా కామోద్దీపనం తగినంతగా ఉన్నప్పుడే సాధ్యపడతాయి. కాబట్టి తగినంత సంసిద్ధత లేకపోతే ఇవేమీ జరగక సంభోగం బాధాకరంగా తయారవుతుంది. ఇక పైపైని సమస్యల వల్ల వచ్చే నొప్పి చాలావరకూ- యోనిలో పూత, జననాంగ హెర్పిస్‌, యోని కండరాల వాపు, కండరాలు బలంగా బిగదీసుకుపోవటం వంటి వాటివల్ల వస్తుంది. కండోమ్‌లు సరిపడకపోవటం, గర్భనిరోధక క్రీములు, సాధనాలవంటి వాటివల్ల కూడా నొప్పి రావచ్చు. కొందరిలో నొప్పి ఓ మోస్తరుగానే ఉంటే మరికొందరిలో తీవ్రంగా ఉండి, మళ్లీ సంభోగమంటేనే భయపడే పరిస్థితి రావచ్చు. సంభోగ సమయంలో, లేదా ఆ తర్వాత- నొప్పి, మంట, గీరుకుపోయిన భావన.. ఇలా రకరకాలుగా ఉండొచ్చు. ఈ సమయంలో నొప్పిగా ఉన్నా, రక్తస్రావం అవుతున్నా తప్పనిసరిగా వైద్యులతో చర్చించి చికిత్స తీసుకోవాలి. దీనికి పరిష్కారంగా- భంగిమ మార్చుకోవటం, లూబ్రికెంట్లు, మందుల వాడకం వంటి రకరకాల మార్గాలు ఉపకరిస్తాయి. సెక్స్‌ బాధాకరంగా మారినప్పుడు చాలామంది స్త్రీలు అసలు సెక్స్‌ పట్లే అయిష్టత పెంచుకుంటారు. కొన్నిసార్లు నొప్పి తగ్గిపోయినా ఈ భావన మనసు నుంచి పోదు. అందుకే - దంపతులిరువురూ కలిసి అవగాహన పెంచుకోవటం, పుస్తకాలు చదవటం, అవసరమైతే సెక్స్‌ థెరపీ, కౌన్సెలింగ్‌ వంటివి తీసుకోవటం.. వంటివన్నీ ఉపకరిస్తాయి.
భావప్రాప్తి కలత
స్త్రీలలో భావప్రాప్తి గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా అంగాంగ సంభోగంలో ప్రతి స్త్రీ భావప్రాప్తి పొందుతుందన్నది పెద్ద అపోహ! కేవలం 25% మంది మాత్రమే ఈ విధంగా భావప్రాప్తిని చేరుకుంటారనీ, మిగిలిన 75% శాతం మందికి అదనంగా ఎంతోకొంత యోనిశీర్ష ప్రేరేపణ (క్లిటోరల్‌ స్టిమ్యులేషన్‌) అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే దాదాపు 12% స్త్రీలు అసలు ఎన్నడూ భావప్రాప్తినే పొందకపోవచ్చని కూడా అంచనా. చాలామంది స్త్రీలు భావప్రాప్తిని చేరుకోకపోయినా.. సంభోగ సమయంలో భాగస్వామితో సాన్నిహిత్యాన్నీ, తృప్తికరమైన అనుభూతినీ పొందుతారు. కాబట్టి భావప్రాప్తి కలగకపోవటమన్నది- దానికదేగా సమస్య కాదు, ఆమెకుగానీ, భాగస్వామిగానీ అదో సమస్యగా అనిపిస్తే తప్పించి! సరైన ప్రేరణలు లేకపోవటానికి శారీరక కారణాలు కూడా కారణమవుతాయనిఇప్పుడిప్పుడే అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హార్మోన్ల అసమతౌల్యం, యోని శీర్షానికిగానీ, యోనికిగానీ రక్తసరఫరా తగ్గటం వంటివి దీనికి కారణం కావచ్చు.

భావప్రాప్తి అన్నది ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. సెక్స్‌ పట్ల వారికి ఉన్న దృక్పథం, చక్కటి ప్రేరణ, మానసికంగా ప్రశాంతంగా సౌకర్యంగా ఉండటం, స్త్రీపురుషుల పట్ల నిర్దుష్టమైన భావనలుండటం.. ఇవన్నీ భావప్రాప్తిపై ప్రభావం చూపిస్తాయి. ఆందోళన, వ్యాకులత వంటివి భావప్రాప్తిని అడ్డుకోవచ్చు. ప్రస్తుతం భావప్రాప్తి కలగక, దాన్ని పొందాలని ఆశిస్తున్నవారిలో అవగాహన పెంచేందుకు ఇప్పుడు ఎన్నో పుస్తకాలున్నాయి, 'ప్రీ ఆర్గాస్మిక్‌' గ్రూపులు కూడా వీరి కోసం సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నాయి. స్త్రీలు తమ శరీరంపై అవగాహన పెంచుకుని, తమకు తాము సాంత్వననిచ్చుకునేలా సెక్స్‌ థెరపిస్టులు తోడ్పడతారు. ముందుగా ఇలా తన స్పర్శకు తానే స్పందించటం అలవాటైన తర్వాత.. క్రమేపీ అదే అనుభూతిని భాగస్వామితో కూడా పంచుకునే అవకాశాలు పెరుగుతాయి.

అనూహ్య బిగతీత
కొందరికి సెక్స్‌ అంటేనే.. అసంకల్పితంగా యోని ప్రాంతం చుట్టూ ఉండే కండరాలన్నీ ఉన్నట్టుండి బిగదీసుకుపోతుంటాయి. దీన్నే 'వజైనిస్మస్‌' అంటారు. ఇలా కండరాలన్నీ బిగిసినప్పుడు అంగప్రవేశమే కష్టంగా మారుతుంది. దీనివల్ల దాంపత్య జీవితం అసాధ్యంగా పరిణమిస్తుంది. ఇలా అంగప్రవేశం కష్టమైనా కొందరు స్త్రీలలో కామోద్దీపనం, భావప్రాప్తి వంటి మిగిలిన దశలన్నీ బాగానే ఉంటాయి. సంభోగం మాత్రమే కష్టంగా తయారవుతుంది. దీనికి: సంభోగంలో బాధ, నొప్పి, తరచూ యోని ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన మానసిక ఆందోళన, బాధాకరమైన గత అనుభవాలు, తగినంత యోని స్రావాలు లేకపోవటం.. ఇలాంటివన్నీ కారణం కావచ్చు. మొత్తానికి ఈ సమస్యకు చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, దీన్ని అధిగమించేందుకు సైకోసెక్సువల్‌ థెరపిస్టులు సహాయపడతారు.

courtesy: EENADU telugu daily

2 comments:

Anonymous said...

makki ki makki copy chesav
eenadu.net nudi

Anonymous said...

adi nene cheppanu... kada

courtesy ante total copy aithene ala pedatharu babu...

telusuko